Thursday, January 8, 2009

'రావు గారు మారారు'.. నిజంగానే!


రావు గారు చాలా పెద్ద మనిషి.. చాలా పద్ధతైన మనిషని ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. "అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల్లో ఇలాంటి వాడు లేడు'' అని రావుగారి చిన్నతనంలో ఆయన నాయనమ్మ మురిసిపోతూ ఉండేది. ఆవిడ మాటలు నిలబెట్టడానికాఅన్నట్లు ఆయన ఏ నాడు క్రమశిక్ష ణ తప్పలేదు. పద్ధతి లేని మనుషులంటే రావుగారికి చాలా చిరాకు. అసలు అలాంటి వాళ్లకు ఈ భూమి మీద బతికే హక్కే లేదనేది ఆయన గాఢమైన అభిప్రాయం. "ఐ డోంట్‌నో వై దీస్‌ పీపుల్‌ ఎగ్జిస్ట్‌ '' అని విసుక్కొనేవారు. పుట్టిన ఊరులోనేస్కూలింగ్‌ పూర్తయింది. పక్క వూరిలో కాలేజీ చదువు కూడా అయిపోయింది. అప్పుడప్పుడేబ్యాంకులు పెడుతున్నారు. రావు గారి ఊరిలో కూడా ఒక బ్యాంకు పెట్టారు. దాంట్లో ఆయనకిఉద్యోగం వచ్చేసింది. ఉన్న పొలాన్ని చూసుకుంటూ.. ఊర్లోనే ఉద్యోగం చేసుకుంటూ అలా రావుగారు జీవితం గడిపేవారు. వీలైతే మరో దశాబ్దం కూడా అలాగే గడిచిపోయేది ఆ పెళ్లి జరగకుండా ఉంటే...

రావు గారి భార్య సీత చాలా సౌమ్యురాలు. "ఎలా పడుతోందో ఆ మనిషితో.. గాలిని కూడా డిసిప్లైన్‌లో పెట్టాలని చూస్తాడు ఆ పెద్ద మనిషి'' అని ఊరువారు అనుకుంటూ ఉండేవారు. రావు గారు పద్ధతిని మార్చాలని సీత కూడా పెళ్లైన కొత్తలో ప్రయత్నించింది. ఒక నెల రోజులయ్యాక రావు గారికి ఈ విషయం అర్థమయింది. "నిన్నైనా వదిలేస్తా కాని.. నా పద్ధతిని వదిలేయను '' అని ఖండితంగా చెప్పేసారు. " మనిషి మూర్ఖుడు.. అన్నంత పని చేస్తాడని'' సీతకి అర్థమయిపోయింది. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మారకపోతాడా అని సీత ఆశ. ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్దవాళ్లు అయ్యారు. అయినా సీత ఆశ తీరనే లేదు. రావు గారి విషయం తెలిసిన ఆయన బంధువుల ఎప్పుడూ ఆయనను దగ్గరకు చేరదీయలేదు. దానికి ఆయనా ఎప్పుడూ బాధ పడలేదు. ఇలా ఒక పద్ధతి ప్రకారం సాగిపోతున్న రావు గారికి ఒక శుభలేఖ వచ్చింది. అది ఆయన పెద్దనాన్న కొడుకుది. సాధారణంగా రావు గారు పెళ్ళిళ్లకు, పురుళ్లకువ్యతిరేకం. అలాంటి చోట్లకు వెళ్తే ఏది పద్ధతి ప్రకారం జరగదని ఆయన నమ్మకం. అందుకేవీలైనంత వరకూ ఏ శుభకార్యానికి ఆయన వెళ్లడు. పెళ్లం, పిల్లలను పంపడు. ఎందుకో ఆ శుభ లేఖ చూడగానే రావుగారి మనసులో- "ఆ పెళ్లికి వెళ్తే...'' అనే ఆలోచన మొదలయింది. ఆలోచన వస్తే చాలు. సెకన్లలో నిర్ణయాలు తీసుకోవటం.. నిమిషాల్లో వాటిని అమలు చేసేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. శుభలేఖ వచ్చిన మర్నాడే- పెళ్లికి వెళ్తునామనే విషయాన్ని భార్య ఎదురుగా ప్రకటించేశారు రావుగారు. ఆవిడ విస్తుపోయింది. ఆ తర్వాత ఆశ్చర్యపోయింది. చివరకు "అంతా మన మంచికే జరుగుతుందని'' సరిపెట్టుకుంది. రావుగారి ఇద్దరి పిల్లలకు ఆ విషయం తెలిసింది. వాళ్లకీ ఆనందపడాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కాలేదు. అంతా ఇలా ఒక విచిత్రమైన స్థితిలో ఉండగానే ఊరు వెళ్లాల్సిన రోజు దగ్గరపడిపోయింది.
"అదృష్టం కలిసిరాకపోతే పాతిక పోస్ట్‌ ఆఫీసులు తిరిగిన స్టాంపులు కూడా దొరకవు. అందుకే జాగ్రత్తగా ఉండాలి'' అనేది రావుగారి స్టాండర్డ్‌ డైలాగ్‌. అందుకే పెళ్లికి వెళ్లాలని నిర్ణయించుకున్న దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టేశారు. బ్యాంకులో ముందుగానే లీవు అప్లై చేసేశారు. "మీ చాదస్తం కాని.. నెల రోజుల ముందు లీవేమిటండీ'' అని జనరల్‌ మేనేజర్‌ మొత్తుకుంటున్నా వినకుండా ఆయన చేతిలో లీవు లెటర్‌ పెట్టేశారు. రైలు టిక్కెట్లు కొనేశారు. చివరకు పెళ్లిలో వేసుకొనే బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పక్కన పెట్టేశారు. ఆటో వాడికి కూడా పది రోజుల ముందే చెప్పేశారు. అనుకున్నట్లే ప్రయాణం రోజు వచ్చేసింది. రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగే దాకా ఏం చేయాలో రావుగారు షెడ్యూల్‌ తయారుచేసేశారు. అదుపు తప్పద్దనిపిల్లలకు వార్నింగ్‌ కూడా ఇచ్చారు. సరిగ్గా స్టేషన్‌కు బయలుదేరటానికి పావుగంట ముందు వానపడటం మొదలుపెట్టింది. ప్రయాణం అలా మొదలవటం రావు గారి నచ్చలేదు. కాని "ఆటో ముందు మాట్లాడాను కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఎంత ఇబ్బంది అయ్యేదో.. అందుకే పద్ధతి ప్రకారం ఉండాలంటా'' పిల్లలకు క్లాస్‌ తీసుకున్నారు. ఆయన మనసులో మాత్రం ఏదో తేడా జరుగుతోందనే అనుమానం మాత్రం ఎక్కడో పీకుతోంది.
సామాన్లు పెట్టించటానికి కంపార్ట్‌మెంట్‌ ఎక్కేసరికి రావుగారి బెర్త్‌ల దగ్గర ఇద్దరు కుర్రాళ్లు విలాసంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రావుగారికి వారు కూర్చున్న తీరు, మాట్లాడుకుంటున్న మాటలు నచ్చలేదు. "లేవండి.. ఈ బెర్త్‌లు మావి'' కూర్రంగా అన్నారు రావుగారు. ఆ ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆయనను పట్టించుకోలేదు. రావు గారికి ఎవరైనా సమాధానం చెప్పకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. "మిమల్నే.. ఈ బెర్త్‌లు మావి.. వెంటనే ఖాళీ చేయండి''- స్వరం పెంచారు. ఒక కుర్రాడు తలెత్తి చూశాడు. జేబులోంచి టిక్కెట్టు తీశాడు. నెంబర్లు చూసుకున్నాడు. "మావి కూడా'' అన్నాడు. మళ్లీ వాళ్లు మాటల్లో ములిగిపోయారు. రావుగారి కోపం నషాలానికి అంటింది. "మీ టిక్కెట్టు ఏది?'' అరిచారు రావుగారు. ఒక కుర్రాడు తలెత్తి చూశాడు. "మాష్టారు.. మీకు టిక్కెట్టు చూపించాల్సిన అవసరం మాకు లేదు. టీటీ వస్తే చూపిస్తాం..'' అని కచ్చితంగా చెప్పేశాడు. "టీటీ పక్క కంపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు'' అని ఉచితంగా సమాచారం కూడా చెప్పాడు. రావుగారు కుటుంబం ఈ తంతును చాలా ఆసక్తి చూస్తున్నారు. వాళ్లకు తెలిసి రావుగారిని అలా ఎదిరించిన వాళ్లు ఎవరూ లేరు. రావు గారు ఏం చేస్తారా? అనే ఆసక్తి వాళ్లలో పెరిగిపోతోంది. రావుగారి పిల్లలకు ఆ కుర్రాళ్లంటే అప్పుడే ఒక ఆరాధనా భావం పెరిగిపోయింది. "ఈ పరాభవమును నేను సహింతునా- అన్నట్లు రావుగారు వాళ్లకేసి క్రూరంగా చూసి టీటీని వెతుక్కుంటూ బయలుదేరారు. మిగిలిన బెర్తుల్లో పిల్లలు సామన్లు సర్ధటం మొదలుపెట్టారు.
రావుగారు టీటీని తీసుకొని వచ్చేసరికి సీను మారిపోయి ఉంది. రావు గారి కుటుంబం, ఆ కుర్రాళ్లు కలిసి కూర్చుని బిస్కెట్లు తింటున్నారు. "అది కాదు అంటీ..'' అని ఒక కుర్రాడు ఏదో చెబుతున్నాడు. వాళ్లందరిని చూడగానే రావుగారికి చిర్రెత్తుకొచ్చింది. శత్రు శిబిరంలో చేరిన సొంత సైనికులా పిల్లల కేసి ఓ సారి చూశారు రావుగారు. ముందు కుర్రాళ్ల సంగతి డీల్‌ చేస్తే- ఆ తర్వాత పెళ్లం, పిల్లల సంగతి చూడచ్చనుకున్నారు. "వీళ్లు మా బెర్తులు ఆక్యుపై చేశారు..'' అని అధికారికంగా టీటీకి ఫిర్యాదు చేశారు. టీటీ కుర్రాళ్ల టిక్కెట్టు తీసుకున్నాడు. "అరే.. వీళ్లకి ఇదే బెర్తులు ఇచ్చారు.. స్ట్రేంజ్‌.. చాలా తక్కువ సార్లు ఇలా జరుగుతుంది'' అన్నాడు టీటీ. "నేను రెండు నెలల ముందే టిక్కెట్లు బుక్‌ చేయించా. ఈ బెర్త్‌లు మావే'' అన్నారు రావుగారు. "..లేకపోతే జీఎంకి కంప్లైంట్‌ ఇస్తా.. నే ఊరుకోను.. ఐ నీడ్‌ జస్టిస్‌ ఇమీడియట్లీ'' అని ఇంగ్లిషులోకి దిగిపోయారు. కుర్రాళ్లలో మాత్రం ఏ కోశానా భయం కనపడటం లేదు. బెర్తులు లేవన్న విషయం కన్నా.. కుర్రాళ్ల నిర్లక్ష్యం రావుగారికి ఎక్కువ కోపం తెప్పిస్తోంది. "అరే.. అలా అంటే ఎలా? ఇది వాళ్ల తప్పు కూడా కాదు కదా.. నేను బెర్త్‌లు వేరే చోట ఎడ్జెస్ట్‌ చేస్తా.. కాస్త విజయవాడ దాకా ఓపిక పట్టండి'' అన్నాడు టీటీ. రావుగారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఆయన జీవితంలో చాలా తక్కువ వచ్చాయి. "అనువుకాని చోట.. '' అనే పద్యం గుర్తుకు వచ్చింది. "విజయవాడలో మాత్రం బెర్త్‌లు ఖాళీ చేయించాలి..'' అని టీటీకి కండిషన్‌ పెట్టారు రావుగారు. "అరే.. అంకుల్‌.. అంత టెన్షన్‌ ఎందుకు? విజయవాడలో ఖాళీ చేసేస్తాంగా..'' అన్నాడో కుర్రాడు. ఆ నవ్వుకి రావుగారికి ఇంకా కోపం వచ్చింది. పళ్ల బిగువున కోపాన్ని అణుచుకొని కూర్చున్నారు. సీతకి, పిల్లలకు ఇదంతా చాలా ఆసక్తిగా ఉంది. తర్వాతేం జరుగుతుందనే భయం కూడా ఓ మూల ఉంది. అందుకే ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. స్టేషన్లు వస్తున్నాయి.. పోతున్నాయి.. సీత, పిల్లలు- రెండు బెర్తుల్లో సర్దుకొని పడుకున్నారు. రావు గారు మాత్రం ఒక కుర్రాడి బెర్తులో కూర్చున్నారు. ఆయన మనసంతాభగభగ మండిపోతోంది. అసలు ట్రైన్‌లో టిక్కెట్లు కొన్నందుకు తనను తాను తిట్టుకున్నారు. చివరకు విజయవాడ వచ్చింది. "బై అంకుల్‌.. '' కోరస్‌గా చెప్పి కంపార్ట్‌మెంట్‌ దిగారు కుర్రాళ్లు. రావుగారికి కోపం ఇంకా దిగలేదు. ఆ కుర్రాళ్లను అలా పెంచిన తల్లితండ్రులను కాల్చేయాలనిపించింది. కాని కోపాన్ని దిగమింగుకొని బలవంతంగా పడుక్కొన్నారు. రాత్రంతా నిద్రపట్టలేదు. మనసులో ఏదో తెలియని గుబులు. ఉదయాన్నే దిగాల్సిన స్టేషన్‌ వచ్చిన తర్వాత కాని కొంత కుదుట పడలేదు.
స్టేషన్‌కు రావుగారి పెద్దనాన్న కొడుకు కారు పంపాడు. డైరక్ట్‌గా హోటల్‌కి వెళ్లిపోయారు. సీత, పిల్లలు స్నానం చేసి, బట్టలు మార్చుకున్నారు. ఇంతలో ఒకరి తర్వాత మరొకరు చుట్టాలు రూమ్‌లోకి రావటం మొదలుపెట్టారు. రావు గారిని పలకరించి.. సీత,పిల్లలతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవహారం రావుగారికి చిరాకు తెప్పించింది. ఆయనతో మాట్లాడే వాళ్లు లేరు. అందరూ ఒక సారి నమస్కారం పెట్టి పక్కకి వెళ్లిపోయేవాళ్లే.. అంతకన్నా ప్రమాదకరమైన విషయం- భార్య, పిల్లలు అదుపు తప్పుతారేమో అనే భయం ఆయనను పీడించటం మొదలుపెట్టింది. " ట్రైన్‌లో కుర్రాళ్లను ఏం చేయలేని వాడు.. మనల్నే చేస్తాడు అనుకుంటే మొత్తం జీవితమే మారిపోతుంది'' అనుకున్నారు. పిల్లలకు క్లాస్‌ తీసుకుందామనుకున్నారు.. కాని వాళ్లు చిక్కలేదు. ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉన్నారు. మధ్యాహ్నానికి పరిస్థితి మరింత విషమించింది. రావు గారికి ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. ఏం చేయాలో తెలియక భోజనానికి బయలుదేరారు రావు గారు. కళ్యాణ మండపానికి వెళ్లేసరికి ఎవరు కనిపించలేదు. భోజనాల దగ్గరకు వెళ్లారేమోనని అక్కడికి వెళ్లారు రావుగారు. అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. అటూ ఇటూ చూస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు.. "అప్పుడే భోజనాలు పెట్టమండి'' అన్నాడు. రావుగారికి కోపం నషాళానికి అంటింది. "నేను ఈ దరిద్రపు భోజనం కోసం రాలేదు.. వెతుక్కుంటూ వచ్చా.. ప్రతివాడు నన్ను అనేవాడే..'' అని గట్టిగా అరవటం మొదలుపెట్టారు. ఆ అరుపులకు కళ్యాణమండపంలో ఉన్న వాళ్లు కిందకి వచ్చారు. "ఏమైంది..'' అడిగాడు రావుగారి పెదనాన్న కొడుకు. "ఈయన భోజనం కోసం వచ్చారండి.. ఇప్పుడే వడ్డించటం లేదన్నాం.. కోపంతో అరుస్తున్నారు..'' అని చెప్పాడు ఆ వ్యక్తి. "రావు.. వదిలేయ్‌.. నువ్వని తెలియక అనుంటాడు..రామం.. నువ్వు అలా అనకూడదు.. ఎవరు పెద్ద మనిషో.. ఎవరు కాదో చూడాలి..'' అని రెండు పార్టీలకు సర్దిచెప్పాడు రావుగారి పెద్దనాన్న కొడుకు. రావుగారికి ఏమనాలో తెలియలేదు. చుట్టూ చుట్టాలు. దూరం నుంచి పిల్లలు కూడా చూస్తున్నారు. రావుగారికి తలకొట్టేసినట్లైంది. గిర్రున అక్కడ నుంచి వెనక్కి తిరిగారు..."ఏం మనిషో.. బీపీ అనుకుంటా.. ఇలాంటి వాళ్లతో ఎలా వేగుతున్నారో..'' అన్న ఆ వ్యక్తి మాటలు రావుగారి చెవిన పడ్డాయి. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయారు.
మధ్యాహ్నం రావుగారు భోజనానికి వెళ్లలేదు. హోటల్‌ రూమ్‌లో పడుకున్నారు. ఒంటి గంట అయింది. ఒకటిన్నర అయింది, రెండు అయింది. రావు గారికి కోపం పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుకున్నందుకు తీవ్రంగా బాధ పెరిగిపోతోంది. కాని మాట్లాడటానికి, చెప్పటానికి ఎవరూ లేరు. రెండింటికి రూమ్‌ బెల్‌ మోగింది. రావు గారి అబ్బాయి వచ్చాడు. " నాన్న నువ్వు అన్నం తినలేదా? '' అని చాలా మామూలుగా అడిగాడు. పట్టుకొని చంపేయాలనంత కోపం వచ్చింది. " నాకు వంట్లో బావులేదు.. '' అని ముక్తసరిగా చెప్పారు రావుగారు. కొన్ని బట్టలు తీసుకువెళ్లిపోయాడు రావు గారు పిల్లాడు. మళ్లీ ఎవరూ పలకరించలేదు. నాలుగు గంటలయింది. రావు గారి పెద్దనాన్న కోడుకు వచ్చాడు. " రావు.. నీకు వంట్లో బావులేదుట.. డాక్టర్‌కి చూపించాలా '' అని అడిగాడు. రావుగారికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఒక పక్క చాలా ఆకలి వేస్తోంది. ఇప్పుడు జ్వరం లేదంటే పరువుపోతుంది. అలాగని భోజనానికి ఎందుకు రాలేదంటే చెప్పటానికి కారణం లేదు. ఉదయం జరిగిన గొడవకి చిన్నపిల్లాడిలా అలిగావా అంటారు. ఆ పరిస్థితే విచిత్రంగా తయారయింది. " అబ్బే.. పర్వాలేదు.. నీళ్లు పడలేదు.. అంతే.. రాత్రి పెళ్లి టైమ్‌కి బానే అయిపోతా..'' అన్నారు రావు గారు." సరే.. జాగ్రత్త ''అని చెప్పి వెళ్లిపోయాడు పెద్దనాన్న గారి అబ్బాయి. రావు గారు ఎవరూ చూడకుండా హోటల్‌ నుంచి బయటకు వచ్చారు. పక్క వీధిలో వేరే హోటల్‌ ఉంటే అక్కడికి వెళ్లి టిఫిన్‌ చేశారు. హోటల్‌ రూమ్‌కి వచ్చి పడుకున్నారు. రాత్రి ట్రైన్‌లో సరిగ్గా నిద్రలేఏకపోవటం.. ఉదయం నుంచి ఆకలితో మాడిపోవటం వల్ల రావు గారిని నిద్ర పట్టింది. మధ్యలో ఏవో మాటలు వినిపిస్తున్నాయి. అది కలో.. నిజమో కూడా తెలియదు రావుగారికి.. చాలా మగతగా ఉంది." ఇలాంటి వాడితో ఎలా వేగుతున్నావు? ''అంటోంది ఓ కంఠం. "ఏం చేయను.. సర్దుకుపోతున్నా.. మనిషి చాలా మంచివారు. కాని ఆ మూర్ఖత్వం, పట్టుదల..ఏం చెప్పను పిన్నీ.. కొన్ని సార్లు వదిలేసి వెళ్లిపోవాలనిపిస్తుంది. కాని మేం లేకపోతే ఆ మనిషి బతకడు. బతకలేడు. స్నేహితులు లేరు చుట్టాలు లేరు. ఎప్పుడూ మమల్నే కనిపెట్టుకొని ఉంటాడు. చాలా సార్లు చెప్పా.. వినడు.. కొందరు అంతే.. పిల్లలు మాత్రం అలా కాకుండా చూసుకుంటున్నా ''- అంటోంది మరో కంఠం. ఆ కంఠం రావుగారి భార్య సీతది. రావు గారికి తల గిర్రున తిరిగినట్లు అయింది. తనని వీళ్లు అర్ధం చేసకున్నది ఇంతేనా అనిపించింది..ఆ తర్వాత మనసులో ఏవో ఆలోచనలు. అలా మగతగా పడుకున్నారు రావు గారు.
రాత్రి 7 గంటలయింది. " ఇంకా ఎంత సేపు పడుకుంటారు? పెళ్లికి టైం అవుతోంది..ఒక వేళ రావాలని లేకపోతే రూమ్‌లోనే ఉండిపోండి..'' అంటూ నిద్ర లేపింది సీత. రావుగారికి ఏం మాట్లాడాలో తెలియలేదు. కాని సీత మాటల్లో నన్ను పెళ్లికి వచ్చి ఇబ్బంది పెట్టకు అనే అర్దం మాత్రం స్పురించింది. "పర్వాలేదు.. బానే ఉన్నా.. తయారయి వస్తా.. ''అని ఐదు నిమిషాల్లో తయారయిపోయారు రావు గారు. భార్యతో కలిపి పెళ్లి మండపానికి వెళ్లారు. అక్కడ కూర్చున్నారు. బంధువులు వస్తున్నారు. వాళ్లతో మాట్లాడుతున్నారు. అలా కళ్ల ముందు పెళ్లి జరిగిపోతోంది. రావు గారి మనసులో ఏవో ఆలోచనలు. సీతకు, పిల్లలకు రావుగారు ఏదో ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఏం జరగబోతోందో అనే భయం కూడా మనసు మూలల్లో ఎక్కడో ఉంది. కాని రాకరాక వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం వాళ్లకి ఇష్టం లేదు. అందుకే వాళ్ల సరదాల్లో వాళ్లు ములిగిపోయారు. రాత్రి 11 గంటలయింది. పెళ్లి అయిపోయింది. పిల్లలు, సీత మాత్రం మండపంలోనే ఉండిపోతామన్నారు. రావు గారు రూమ్‌కి వెళ్లిపడుకున్నారు. ఆయనలో ఏవో ఎడతెగని ఆలోచనలు. ఉదయం అయింది. 11 గంటలకు ట్రైన్‌. అందరూ తమ ఊళ్లకు వెళ్లిపోవటానికి సామాన్లు సర్ధుకుంటున్నారు. " రాత్రి చాలా సరదాగా గడిచిందండి. మీరు కూడా ఉండే బావుండేది. మీ గురించి అడిగారు కూడా..'' ఇలా సీత చెబుతోంది. పిల్లలు తమతో తాము ఏదో మాట్లాడుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు. వాళ్లు అంత ఆనందంగా ఉండటం రావు గారు ఎప్పుడూ చూడలేదు. సీత పెళ్లి విశేషాలు చెబుతూనే ఉంది. రావు గారు ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. అందరికి చెప్పి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. రైలు ఎక్కారు. రావు గారు మాత్రం ఏ మాట్లాడటం లేదు. ఏదో ఆలోచిస్తున్నారు. సీత, పిల్లలు కూడా ఏం మాట్లాడలేదు. మొత్తం మీద ఊరికి రావుగారు, కుటుంబం తిరిగి వచ్చేశారు.
ఆ రోజు తర్వాత రావుగారు క్రమశిక్షణ గురించి ఎవరితోను మాట్లాడలేదు. భార్యతో సహా ఎవ్వరికి ఏ పని ఎలా చేయాలో చెప్పలేదు. రావుగారిలో అంత మార్పు ఎందుకు వచ్చిందో ఊరిలో ఎవ్వరికి తెలియలేదు. కాని ఇప్పుడు - అందరూ రావు గారు చాలా పెద్దమనిషి.. పద్ధతైన మనిషి అనుకుంటుంటారు.
(నవ్య వీక్లి 14.1.2009 నాటి సంచిక)
బ్లాగర్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
.

Friday, December 5, 2008

విరహం వేదాంతం


తాళలేనే ఓ మనసా!


దూరంగా పాడు పక్షి.. సంధ్య వేళ మధ్యమావతిలో పాడుతోంది. అసలే చలి కాలం. సాయంత్రం వచ్చిందంటే గుబులు..గుబులు.. గోపయ్యలు ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు. ఆలమందల తాకిడితో దుమ్ము రేగుతోంది. దూరం నుంచి చూస్తే- పెద్ద మేఘం యుద్ధానికి వస్తున్నంటుంది. ఘల్లు.. «ఘల్లు మంటూ గజ్జెల చప్పుడు వినసొంపుగా ఉంది. గాలి జోరుగా వీస్తుంటే దగ్గరగా వచ్చినట్లు అనిపిస్తోంది. రుక్మాంద పిల్లలకు దుంపలు కాల్చిపెడుతోంది. తేమలో తడిసిన కట్టెలు కాలుతున్న వాసన. కమ్మగా ఉంది. ఆ వాసన పీలుస్తుంటే ఏవేవో భావనలు. పెళ్లైన తొలి రోజులు గుర్తుకొస్తున్నాయి. వసంత మాసం.. వెన్నెల రేయి..మారం చేసి పెనిమిటితో పొలానికి వెళ్లా. అంతా చిమ్మచీకటి. మధ్యలో చిన్న మంట. మిణుకు మిణుకుమంటూ- మంటలోకి వచ్చి పడే మిణుగుడు పురుగులు. మీకు మేమే తోడు అన్నట్లు గాలికి ఊగే కంకెలు. మంట పక్కనే కూర్చుని దుంపలు కాల్చుకుతింటుంటే... ఆ అనుభూతే వేరు. వాటిని తలుచుకుంటుంటే- గుండె తీయ్యగా ములుగుతుంది. కొక్కొరో..కో.. అని ఎక్కడో కోడి కూసింది. పాడు కోడి.. రాత్రి, పగలు ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడే కూస్తుంది. అయినా ఒంటిరితనానికి రాత్రేమిటి.. పగలేమిటి. పెనిమిటి ఇంట్లో లేడు. ఊరికి వెళ్లాడు. అత్త తిరునాళ్లకు వెళ్లింది. పెళ్లైయి ఆరు నెలలే అయింది. పెనిమిది వదిలేసి వెళ్లటం ఇదే తొలిసారి. ఏం చేయాలో పాలుపోవటం లేదు. మధ్యాహ్నం అమ్మలక్కల కబుర్లు గుర్తుకు వచ్చాయి. ప్రతి వాళ్లకి కృష్ణుడే కావాలి. అందరి కళ్లు అతనిమిదే. పోని.. చూడటానికి అంత అందంగా ఉంటాడా? తెల్లని వళ్లుందా.. లేదు. నల్లటి వాడు. సరైన గుణముందా.. లేదు.. గోపికలతో తిరగని రోజు లేదు. సరైన కుదురుందా..లేదు.. ఏ నిమిషాన్లో ఎక్కడుంటాడో తెలియదు. కాని ఏదో తెలియని ఆకర్షణ ఉందంటారు. ఒక్క సారి ఆ ధ్యాసలో పడితే- ఇక వదిలే ప్రసక్తే లేదు. అంతా కృష్ణమయం. రోజంతా కృష్ణమాయ. తెలియకుండా కొన్ని ఏళ్లు ఆ కృష్ణ మాయలో పడిపోయినవాళ్లను చూసా. ఇదంతా మాయ అంటే కూడా వాళ్లు వినరూ.. "మనసే మాయ'' అంటారు. ఏమిటో ఆ పిచ్చి.. కృష్ణుడే ఓ పెద్ద పిచ్చి.. మనసుకు పట్టిన పెద్ద పిచ్చి. మధ్యాహ్నం గొల్లభామల మాటల విన్న దగ్గర నుంచి మనసులో ఏదో గుబులు. మాటు మాటుకి కృష్ణుడు గుర్తుకొస్తున్నాడు. అప్పటి దాకా గుట్టుగా ఉన్న నా మనస్సులోకి చొచ్చుకు వచ్చేసాడనిపిస్తోంది. రాత్రి అయింది. జడత్వం. కాలు తీసి పెట్టబుద్ధి కావటం లేదు. మనసుకు జ్వరం వచ్చినట్టుంది. దూరంగా మొగలి వాసన. గుప్పుమని వస్తోంది. హఠాత్తుగా కిటికీలో నుంచి ఎవరో ఊదినట్లు గాలి వీచింది. అప్పటి దాకా స్తబ్దుగా ఉన్న వాతావరణం అంతా మారిపోయింది. దూరంలో ఎవరో పాడుతున్నారు..


తలుపు తీయునంతలోనే తత్తరమది ఏలనోయి

తలుపు తీతు- వీలు చూచి తాళుము కృష్ణా

కొంత సేపు తాళుము కృష్ణా

పతి నిద్దుర పోవలేదు మతి సందియమొందెనేమో

పతికి కునుకు పట్టగ లోపలకు వత్తువు గాని

తాళుము కృష్ణా- తాళుము కృష్ణా

ఏల అంత తత్తరంబు ఏల అంత భయము స్వామి

నిన్ను గాక వేరు ఒకని ఎట్లు వలవగలను

కృష్ణా తాళుము కృష్ణా- తాళుము కృస్ణా

మైమరచి ఆ పాట వింటూనే ఉన్నా. పాట అయిపోయిన తర్వాత కూడా నేను బాహ్య ప్రపంచంలోకి రాలేదు. మనసులో ఏదో ఉత్సాహం. హఠాత్తుగా నా మనసంతా కృష్ణుడే నిండిపోయాడు. ఆ గోపబాలుడిని దగ్గరకు తీసుకోవాలి.. చెవిలో ఏవో ఊసులు చెప్పాలి.. నవ్వుతుంటే బుగ్గపై పడే సొట్టను చూడాలి.. జట్టును ముడి వేసి అందంగా పూలు పెట్టాలి.. ఇలా ఒకటా? రెండా? అనేక ఆశలు. ఏదో తెలియని ఆరాటం. ఉరుకున లేచా. క్షణాల్లో స్నానం చేశా. అందంగా తయారయ్యా. ఎందుకు అవుతున్నానో కూడా తెలియదు. అంతా క్షణాల్లో జరిగిపోతోంది. మనసులో కృష్ణయ్య తప్ప వేరే ఆలోచనే లేదు. రాత్రి అన్నం వండుకోబుద్ది వేయలేదు. పళ్లు తిందామనకున్నా. అవి తినబుద్ధి అవలేదు. పొద్దు కుంకింది. బయటంతా చిమ్మచీకటి. ఇంట్లో పట్టపగలులా దీపాలు. ఎప్పుడు పడుక్కున్నానో నాకే తెలియదు. నా ముందు కృష్ణుడు. ఓ పెద్ద గుర్రం. నురగలు కక్కుతూ పరుగులు తీస్తోంది. కృష్ణయ్య దాన్నే తీక్షణంగా చూస్తున్నాడు. దగ్గరకు వచ్చేసరికి చట్టుకున పట్టుకున్నాడు. మెడలు వంచాడు. లొంగ దీసుకుంటున్నాడు. నేను కృష్ణయ్య పక్కనే ఉన్నా. నాలో ఏదో తెలియని ఆరాటం. కృష్ణయ్య గుర్రాన్ని లొంగదీసేసుకున్నాడు. ఇక మనసంతా ప్రశాంతం. ఆరాటం ఆమడదూరం పారిపోయింది. "పిచ్చిదానా! చూశావా..ఈ గుర్రాన్ని.. నీ మనస్సులాంటిదే. ఎందుకు పరిగెడుతోందో తెలియదు.. ఎంత వేగంతో పరిగెట్టాలో తెలియదు. దానికి కళ్లెం వెయ్యకపోతే అనర్థాలు తప్పవు కదా..'' అంటున్నాడు కృష్ణయ్య. ఇంతలో భళ్లున తెల్లారింది. మనసంతా ఎవరో కడిగేసినట్లు ప్రశాంతంగా ఉంది.


(బొమ్మకు బాపు గారికి.. పాటకు కీర్తి శేషులు బసవరాజు అప్పారావుగారికి, గొరుసు జగదీశ్వర రెడ్డి గారికి కృతజ్ఞతలు)